Tuesday, April 23, 2019

నమ్మకం...(దీని రుచి మారుతూ ఉంటుంది)

రచన: జయంతి ప్రకాశ శర్మ

రైలు తుని స్టేషన్లో ఆగింది.‌  ప్లాట్ ఫారం మీద వెళ్తున్న కాఫి వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని చిల్లర లేకపోతే రెండు వందల రూపాయల నోటు ఇచ్చాను. వాడు మిగతా డబ్బులు ఇచ్చేలోగా,   రైలు బయలుదేరి పోయింది. 
 "అదిగో.. అదే తెలివితేటలు! ముందు చిల్లర తీసుకుని తర్వాతే నోటు ఇవ్వాలి. వయసొచ్చింది, ఏం లాభం?" పక్కనే కూర్చున్న మా ఆవిడ అవకాశం వచ్చిందని పెనాల్టీ కార్నర్ కొట్టింది.
"సరే.. వాడు చిల్లర ఇచ్చిన తర్వాత రైలు బయలుదేరి పోతే... అప్పుడు?" 
"వాడికేం నష్టం ఉండదు. మనలాంటి వాళ్ళని ఉదయం నుంచి ఓ పదిమందిని చూసుకుంటారుగా, నష్టం ఉండదు!"
"ఆ మాత్రం నమ్మకం మనిషి మీద ఉంచాలి. అయినా ట్రైయిన్ బయలుదేరిపోతే వాడేం చేస్తాడు?"
"వాళ్ళు దాని కోసమే ఎదురు చూస్తూంటారు. మీలాంటి ఓ నాలుగు మాలోకాలు తగిలితే చాలు, రోజు గడిచిపోతుంది!" 
రైలు బాగా స్పీడ్ అందుకుంది. డబ్బులు తిరిగి వస్తాయనే అశ నాలో కూడా సన్నగిల్లింది. 
మనుషుల మీద నమ్మకం, జాలి నాకెక్కువని మా ఆవిడకి ఓ నిశ్చితమైన అభిప్రాయం ఉంది. ఆ విషయంలో చాలా సార్లు నేను తన ముందు ఓడిపోవడం, చీవాట్లు తినడం అలవాటై పోయింది.
"పోనిలెద్దు, పేదవాళ్ళు! మన డబ్బులతో వాళ్ళు మేడలు మీద్దెలు కట్టిస్తారా?" అ‌ని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసాను. అప్పటికే తోటి ప్రయాణీకులు కూడా నన్నో వెర్రివాడ్నిలా చూస్తున్నారు.
"సార్.. రెండు కాఫీలు తాగి, రెండు వందల నోటు మీరే కదా ఇచ్చారు?"  ఆ మాట వినేసరికి ఇటు చూసాను.  ఓ పదిహేను సంవత్సరాల కుర్రాడు, మిగతా నూట ఎనభై రూపాయలు చేతిలో పెట్టాడు. 
"నువ్వూ..."
"వాళ్ళబ్బాయినండీ. రోజూ ఒకటో రెండో ఇలాంటివి జరుగుతాయని, నేను తునిలో రైలు ఎక్కి ఉంటానండి. మా అయ్య  'ఫలాన వాళ్ళకి మనం చిల్లర ఇవ్వాలని, వాళ్ళ సీటు నెంబరు పోన్లో చెపుతారండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నేను పక్క స్టేషన్లో దిగి, ఇంకో బండి ఎక్కి వెనక్కి వెళ్ళిపోతానండి. అందుకోసం కొంత చిల్లర నా దగ్గర ఉంచుతారండి మా అయ్య!"
మా ఆవిడ ముందు విజయం సాధించాననే ఆనందం కంటే, వచ్చే తరం వాళ్ళకి నిజాయితీని నేర్పిస్తున్నా, 
ఆ కాఫివాడికి మనసులోనే చేతులు జోడించి నమస్కరించాను..

No comments:

Post a Comment