Saturday, January 29, 2022

Srila Prabhupada Introduction in Telugu

 *పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఏ.సి. భక్తివేదాంత స్వామి*

*ప్రభుపాదుల పరిచయము*

-------------------------------------------

పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు భారతదేశములోని కలకత్తా నగరములో 1896 వ, సంవత్సరములో జన్మించారు. వారు తమ ఆధ్యాత్మికాచార్యులైన శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామి వారిని కలకత్తాలో 1922 వ, సం.లో మొదటిసారి కలుసుకున్నారు. శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతుల వారు ప్రముఖ వైదిక విద్యాసంపన్నులు, 64 గౌడీయ మఠాలను (వైదిక సంస్థలు) స్థాపించారు. వారు విధ్యాసంపన్నులు, యువకులైన ప్రభుపాదుల వారిని చూచి మిక్కిలి సంతోషించి, వైదిక విజ్ఞానాన్ని బోధించడానికి తమ జీవితాన్ని అంకితము చేయుమని ఉపదేశించారు. ఆనాటి నుండి శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూరు వారికి శిష్యులై పదకొండు సంవత్సరాల తరువాత యథావిధిగా దీక్షను తీసుకున్నారు.


మొదటి సమావేశములోనే శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూరు గారు ఆంగ్ల భాష ద్వారా వైదిక విజ్ఞానాన్ని ప్రచారము చేయమని శ్రీల ప్రభుపాదుల వారిని కోరారు. తరువాత సంవత్సరాలలో శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకు భాష్యమును రచించి, గౌడీయమఠ కార్యక్రమాలకు తోడ్పడ్డారు. 1944లో ‘బ్యాక్ టు గాడ్హెడ్’(భగవద్దర్శనం) అనే ఆంగ్లపక్ష పత్రికను స్థాపించారు. అది ఇప్పుడు పాశ్చాత్యదేశాలలో వారి శిష్యులు చేత ముప్పయి కంటె ఎక్కువ భాషలలో కొనసాగించబడుతుంది.


శ్రీల ప్రభుపాదుల వారి భక్తివిజ్ఞానాలను గుర్తించి 1947లో గౌడీయ వైష్ణవ సంఘం వారికి భక్తివేదాంత బిరుదమును ఇచ్చి గౌరవించింది. 1950లో 54 సంవత్సరాల వయస్సులో ప్రభుపాదుల వారు వైవాహిక జీవితాన్ని విడిచి పెట్టి ఎక్కువకాలము గ్రంథాలను చదవడానికీ, వినియోగించ సాగారు. తరువాత వారు వృందావనానికి వెళ్ళి అక్కడ మధ్యయుగంలో చరిత్ర ప్రసిద్ధి కెక్కిన శ్రీశ్రీ రాధా దామోదర మందిరములో అతి నిరాడంబర జీవితమును గడిపారు. అక్కడే వారు చాలా సంవత్సరాల పాటు ఉండి ఎంతో విద్యా వ్యాసంగం చేసి అనేక గ్రంథాలను రచించారు. 1959 లో సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించారు. తమ జీవిత ముఖ్య రచన అయిన శ్రీమద్భాగవతములోని 18,000 శ్లోకాలకు అనువాదము, వ్యాఖ్యానాలతో కూడిన అనేకసంపుటాలుగా రచనను ప్రారంభించారు. గ్రహాంతర సులభయానం అనే మరో గ్రంథాన్ని కూడా రచించారు.


శ్రీమద్భాగవతము మూడు సంపుటాలుగా ప్రచురించాక ప్రభుపాదుల వారు తమ ఆధ్యాత్మికాచార్యుల కోరికను నెరవేర్చడానికి 1965 లో అమెరికా సంయుక్తరాష్ట్రాలకు వెళ్ళారు. అప్పటి నుండీ వారు భారతీయ వేదాంత గ్రంథాలపై ప్రామాణికాలైన వ్యాఖ్యానాలు, భాషాంతరీకారణాలు, సంగ్రహ వ్యాఖ్యలు 70 సంపుటాలకు పైగా రచించారు.


1965 లో మొట్టమొదటిసారిగా ఒక వాణిజ్యనౌకలో న్యూయార్కు నగరానికి వెళ్ళినప్పుడు వారిదగ్గర ఒక్కపైస కూడ లేదు. తరువాత ఒక సంవత్సరానికి అంటే 1966 జూలైలో వారు అతికష్టము మీద అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని (ఇస్కాన్) స్థాపించగలిగారు. పది సంవత్సరాల లోపలే ఆ సమాజము బాగా అభివృద్ధి చెంది ప్రపంచమంతట వ్యాపించ సాగింది. పాఠశాలలు, మందిరాలను, ఆశ్రమాలు మొదలైన వాటిని నెలకొల్పసాగింది.


1968 లో శ్రీల ప్రభుపాదుల వారు న్యూవర్జీనియాలోని కొండల పైన ఆధ్యాత్మిక సమాజాన్ని స్థాపించి దానికి నూతన వృందావనము అని పేరును పెట్టారు. అక్కడే ఒక వైదిక పాఠశాలను నెలకొల్పి పాశ్చాత్యదేశాలకు సైతము వైదిక గురుకుల విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ నూతన వృందావనము ఇప్పుడు వేయి ఎకరాలకు పైగా వైశాల్యము గల ప్రదేశములో విరాజిల్లుతుంది. అమెరికాలోని వారి శిష్యులు అలాంటి సంఘాలను ఎన్నింటినో స్థాపించారు.


1972 లో పరమపూజ్యశ్రీ శ్రీమత్ ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలలోని డెల్లాస్, టెక్సాస్లలో వైదిక పద్ధతిలో గురుకులాలను ఏర్పాటు చేశారు. 1972 లో ముగ్గురు విద్యార్థులతో ప్రారంభమైన గురుకులము 1975 నాటికి 150 మంది విద్యార్థులతో విరాజిల్లింది.


శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశములో అంతర్జాతీయ కేంద్రాలను నిర్మింప చేయడానికి ప్రోత్సహించారు. పశ్చమ బెంగాలులోని మాయాపూరులో శ్రీధామమనే అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించ తలపెట్టారు. అతివిస్తృతమైన ఆ పథక నిర్మాణానికి చాలాకాలము పట్టవచ్చును. అది వైదిక శాస్త్రపఠనానికి కూడ అనుకూలముగా నిర్మించబడింది. భారతదేశములోని వృందావనములో మహోన్నతమైన కృష్ణబలరామ మందిరము ఆ పద్ధతుల ప్రకారమే నిర్మించబడింది. అక్కడ ఒక అంతర్జాతీయ అతిథి గృహము కూడ నిర్మించబడింది. పాశ్చాత్యులక్కడ నుండి వైదిక సంస్కృతిని స్వయంగా నేర్చుకునే అవకాశము ఉంది. బొంబాయిలో ప్రధాన సాంస్కృతిక విద్యాకేంద్రము కూడ గలదు. భారతదేశములో సుమారు పద్దెనిమిది ముఖ్యస్థానాలలో ఇతర కేంద్రాల నిర్మాణము కొనసాగుతుంది.


శ్రీల ప్రభుపాదుల వారి ముఖ్యాతి ముఖ్యమైన సేవ గ్రంథరచన. దాని ద్వారా వారు ఎంతో ప్రసిద్ధిని పొందారు. వారి గ్రంథాలు ప్రామాణికత్వానికీ, జ్ఞాన గాంభీర్యానికీ, వైదుష్యానికి పెట్టింది పేరు. అవి విద్వాంసుల చేత ఎంతగానో గౌరవించబడ్డాయి. అనేక కళాశాలల్లో, పాఠశాలల్లో ప్రామాణిక పాఠ్యగ్రంథాలుగా నిర్ణయించబడ్డాయి. వారి రచనలు ఎవభైకి పైగా భాషలలోకి అనువదించబడ్డాయి. ప్రభుపాదుల వారి గ్రంథాలను ముద్రించి, ప్రకటించడము కోసమే 1972 లో భక్తివేదాంత బుక్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించారు. అది ఇప్పుడు భారతీయ వైదికతత్త్వ విషయాలపై గ్రంథాలను ప్రచురించే ప్రపంచ ప్రముఖ ప్రచురణ సంస్థగా రూపొందింది.


వార్ధక్యము సమీపించినను షుమారు పన్నెండు సంవత్సరాలలో శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమంతటా పదునాలుగుసార్లు ఉపన్యాస యాత్ర సాగిస్తూ ఆరుఖండాలలో పర్యటించారు. అంతటి నిర్విరామ కార్యక్రమాలలో నిమగ్నులై యున్నప్పటికీ వారు తమ గ్రంథరచనను కొనసాగిస్తూనే ఉండేవారు. వారి గ్రంథాలన్నింటిని కలిపితే ఒక ప్రఖ్యాత వైదిక వేదాంత సాహిత్య సంస్కృతీ గ్రంథాలయ మవుతుంది.


1977 నవంబరు 14 వ తేదీన వారు ఉత్తరప్రదేశ్ లోని వృందావనమున తిరోభవించు కాలమువరకు నిర్విరామముగా శ్రమించారు.  *ప్రపంచమంతటా వందలకు పైగా ఆశ్రమాలను, మందిరాలను, సంస్థలను స్థాపించి కృష్ణచైతన్య సంఘాన్ని అంతర్జాతీయ సంస్థగా (ఇస్కాన్ గా) తీర్చిదిద్దారు.*

No comments:

Post a Comment